హలో సినిమా రివ్యూ (22/12/17)

Posted on 22 Dec, 2017 in Cinema |   0 Comments

 
మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (22/12/17.. 04.30pm)
                  అక్కినేని అఖిల్ హీరోగా చేసిన రెండవ సినిమా ‘హలో’ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. నాగార్జున నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి పాజిటివ్ బజ్ నెలకొంది. 

కథ :
                అనాథైన శీను (అఖిల్) తన చిన్నప్పటి స్నేహితురాలు జున్ను (కళ్యాణి ప్రియదర్శిన్) ను ఎంతో అభిమానిస్తాడు. జున్ను కూడా శీను అంటే ఎంతో అభిమానం చూపిస్తుంది. వాళ్ళిద్దరి స్నేహం కొనసాగుతుండగా జున్ను ఢిల్లీ వెళ్లిపోతూ అతనికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమంటుంది. ఆ నెంబర్ ను పోగొట్టుకున్న శీను జున్ను ఎప్పటికైనా తిరిగొస్తుందని 13 ఏళ్ల నుండి ఎదురుచూస్తూనే ఉంటాడు. ఎదురుచూపుల్లో ఉన్న శీనును జున్ను ఎలా కలిసింది ? ఆమెను చేరుకోవడానికి శీను ఎలాంటి సాహసాలు చేశాడు ? విధి వాళ్ళిద్దర్నీ ఎలా కలిపింది ? అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :
               సినిమాను మొదలుపెట్టడమే ఆహ్లాదకరంగా మొదలుపెట్టిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఇంటర్వెల్ వరకు అలాగే కొనసాగించాడు. హీరో పాత్రని పెద్ద హాడావుడి లేకుండా కూల్ గా నడిపిస్తూ అతని చుట్టూ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ను బిల్డ్ చేశాడు. కొన్ని సీన్స్ లో రమ్యక్రిష్ణ, జగపతిబాబుల నటనతో కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇక హీరో హీరోయిన్ల చినప్పటి స్టోరీని కూడా అందంగా, చూడాలనిపించే విధంగా తీర్చిదిద్దారు. అంతేగాక అందులోని భావోద్వేగాన్ని చాలా సేపటి వరకు అలాగే కొనసాగించి మంచి ఎమోషన్ క్యారీ అయ్యేలా చేశాడు. ఒక హీరోగా అఖిల్ సినిమాకు ఎంత చేయాలో అంతా చేశాడు. మంచి స్టంట్స్, డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ తేలికపాటి ఎమోషన్స్ ను అలవోకగా పలికిస్తూ ఎక్కడా వంక పెట్టడానికి లేని విధంగా పెర్ఫార్మ్ చేశాడు. సినిమాకు మరొక పెద్ద ప్లస్ టెక్నికల్ టీమ్. అనూప్ రూబెన్స్ తన సంగీతంతో ఆరంభం నుండి చివరి వరకు సినిమాను అందంగా తయారుచేశాడు. పాటలు, నైపథ్య సంగీతం అన్నీ బాగా కుదిరాయి. ఫస్టాఫ్ లో వచ్చే యాక్షన్ స్టంట్స్ కొత్తగా, రియలిస్టిక్ గా అనిపించాయి. పి.ఎస్.వినోద్ కూడా తన సినిమాటోగ్రఫీతో ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపించాడు.

మైనస్ పాయింట్స్ :
              ఇంటర్వెల్ సమయానికి హీరో హీరోయిన్లను దగ్గర చేసిన దర్శకుడు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మంచి రొమాంటిక్ ట్రాక్ ను నడపలేకపోయాడు. సినిమా ముఖ్య ఉద్దేశ్యం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, అది గెలవడం అయినప్పుడు వారిద్దరి మధ్య దాని తీవ్రత, దాన్ని పొందడానికి వాళ్ళు పడే తపనను అధికంగా హైలెట్ చేయాలి. కానీ ఇందులో అలాంటివి పెద్దగా కనబడలేదు.  కేవలం హీరో హీరోయిన్ల మాటల్లోనే ప్రేమను మిస్సయ్యాం, దాన్ని పొందాలి అనే భావం కనిపిస్తుంది కానీ దాని కోసం వాళ్ళు క్లైమాక్స్ లో తప్ప ఇంకెక్కడా పెద్దగా ప్రయత్నించక పోవడం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఇక్కడ కొంత ఎమోషనల్ డ్రామాను ప్లే చేసి ఉంటే ప్రేక్షకులు ఇంకాస్త సంతృప్తి చెందేవారు.
 
 
Be the first one to comment. Click here to post comment!