అజ్ఞాతవాసి సినిమా రివ్యూ (10/01/18)

Posted on 10 Jan, 2018 in Cinema |   0 Comments

మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/01/18..    04.30pm)
           పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, యావత్ తెలుగు సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ ల హిట్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. 


కథ:
          ఏబి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని అయిన విందా (బోమన్ ఇరానీ), అతని కొడుకును చైర్మన్ పదవి కోసం కొందరు హత్య చేస్తారు. దాంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బు) అజ్ఞాతంలో ఉన్న తమ పెద్ద కుమారుడు అభిషిక్త్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) ను కంపెనీని కాపాడమని, తండ్రిని చంపిన వాళ్ళను కనిపెట్టమని వెనక్కి పిలుస్తుంది. తండ్రి, తమ్ముడి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకునేందుకు బయటికొచ్చిన అభిషిక్త్ భార్గవ్ నేరస్తుల్ని ఎలా కనిపెడతాడు, వారి మీద పగ ఎలా తీర్చుకుంటాడు, అసలు అభిషిక్త్ భార్గవ్ అజ్ఞాతంలో ఎందుకు ఉండవలసి వస్తుంది అనే అంశాల సమాహారమే ఈ చిత్రం.

ప్లస్ పాయింట్స్ :
        పవన్ కళ్యాణ్ కనిపించే సన్నివేశాలు చాలా వరకు అభిమానుల్ని అలరిస్తాయి. ఫుల్ ఎనర్జీతో, తన ట్రేడ్ మార్క్ మ్యానరిజంతో పవర్ స్టార్ సినిమాను నెట్టుకురావడానికి చాలానే ప్రయత్నించాడు. ఇక హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్, పవన్ కళ్యాణ్ ల మధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. సినిమా ఆరంభం నార్మల్ గానే ఉన్న ఇంటర్వెల్ సమయంలో రివీల్ అయ్యే ట్విస్ట్ కొద్దిగా ఎగ్జైట్మెంట్ కలిగిస్తుంది. ఆరంభం నుండి చివరి వరకు హీరోతో పాటే ఉండే శర్మ (మురళీ శర్మ), వర్మ (రావు రమేష్) లా పాత్రల పై నడిచే కామెడీ చాలా చోట్ల సఫలమై బోర్ కొట్టించే కథనం నుండి కొంతలో కొంత రిలీఫ్ కలిగించింది. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర యొక్క డైలాగులు త్రివిక్రమ్ స్టైల్లో ఉండి అలరించాయి. అలాగే సెకండాఫ్లో వచ్చే కొడకా కోటేశ్వర్ రావ్ పాటలో మాత్రమే పవన్ కొద్దిగా మాస్ స్టెప్పులు వేయడంతో హుషారు కలిగింది. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలు, ఫైట్స్ పర్వాలేదనిపించాయి.  కుష్బు, పవన్ ల మధ్య ఉండే తల్లి, కొడుకుల రిలేషన్ ను ఎలివేట్ చేసే సన్నివేశాలు, వాటిలో ఇద్దరి నటన మెప్పించాయి. చిత్ర నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :
             సినిమా మొత్తంలో త్రివిక్రమ్ మార్క్ అనేదే కనబడకపోవడం పెద్ద బలహీనత.  ఎంత పాత కథనైనా ఆసక్తికరమైన కథనం, బలమైన పాత్రలు, పదునైన మాటలతో రక్తికట్టించి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా తయారుచేయగల త్రివిక్రమ్ ఈ సినిమాలో పూర్తిగా అలసత్వాన్ని ప్రదర్శించారు. తన ప్రతి కథలో కూడా హీరోయిన్లకు ఏదో ఒక ప్రత్యేకతను ఆపాదించి ఆసక్తికరంగా చూపించే త్రివిక్రమ్ ఇందులో మటుకు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఇద్దరికీ కథలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా కథనంలో, కామెడీలో బలవంతంగా ఇరికిస్తూ చిరాకు తెప్పించారు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ వంటి స్టార్ కమెడియన్లు ఉన్నా కూడా వారిని సరిగా వాడకపోవడంతో ఎంటర్టైన్మెంట్ పెద్దగా పండలేదు. కథకు కీలకమైన ప్రతినాయకుడి పాత్ర కూడా బలహీనంగా ఉండటంతో కథనంలో బలం లోపించడమేగాక పవన్ పాత్ర అనవసరమైన హాస్యానికి తప్ప అసలు సరైన లక్ష్యమనేదే లేక తేలిపోయింది. దీంతో అభిమానులు సైతం చాలా చోట్ల నీరసానికి, అసహనానికి లోనవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. వీటన్నింటికీ తోడు హీరో విలన్ ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఎక్కడా ఎగ్జైట్మెంట్, సీరియస్నెస్ లేకపోవడంతో సినిమా మొత్తం చప్పగా తయారైంది.
 
 
Be the first one to comment. Click here to post comment!