నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ - సి40 రాకెట్ (12/1/18)

Posted on 11 Jan, 2018 in General |   0 Comments


మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/01/18..   09.30am)
               భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయి సాధించింది. నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు వందో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది. పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ‌పెట్టేందుకు దూసుకెళ్లింది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2ఇ, ఒక నానో శాటిలైట్‌, ఒక సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి. వీటి ప్రయోగంతో భారత్‌కు చెందిన మొత్తం వంద ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లవుతుంది. 2018లో ఇదే మొదటి ప్రయోగం కావడంతో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌తో 104 ఉప గ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తరలించిన ఘనత ఇస్రో సొంతం. ఆ ప్రయోగంతో రోదసి రంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది. 2013లో అమెరికా 29, 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించాయి. ఆ రికార్డులను భారత్‌ బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డుకు చేరుకుంది. ఈ దఫా మొత్తం 31 ఉపగ్రహాలు ప్రయోగించ‌గా.. వాటిలో 28 విదేశాలకు చెందినవి. ప్రధానంగా ‘కార్టోశాట్‌-2’ సిరీస్‌లోని కీలకమైన ఉపగ్రహం భారత్‌కు చెందినది. దీనితో పాటు మైక్రో, నానో (ఐఎన్‌ఎస్‌)లు మనదేశానివి.
 
 
Be the first one to comment. Click here to post comment!