భాగమతి సినిమా రివ్యూ (26/1/18)

Posted on 26 Jan, 2018 in Cinema |   0 Comments

మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (26/1/18 ..  04.00pm)
               లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన తాజా చిత్రం ‘భాగమతి’. జి. అశోక్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి అంచనాల నడుమ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది.  


కథ:
            చంచల (అనుష్క) ఒక ఐఎస్ఎస్ ఆఫీసర్. ఆమె ఒక ప్రముఖ మంత్రి ఈశ్వర్ ప్రసాద్ (జైరామ్) వద్ద పర్సనల్ సెక్రెటరీగా భాద్యతలు నిర్వర్తిస్తూ ఒక హత్య కేసులో అరెస్టవుతుంది. కస్టడీలో ఉన్న ఆమెను పోలీసులు రహస్య విచారణ కొరకు ఊరికి దూరంగా అడవిలో ఉన్న పాడుబడిన భాగమతి బంగ్లాకు తీసుకెళతారు. చంచల ఆ బంగ్లాలోకి ప్రవేశించగానే బంగ్లాలోని భాగమతి ఆత్మ ఆమెను ఆవహించి భీభత్సం సృష్టిస్తుంది. ఆ భాగమతి ఎవరు, ఆమె చంచలను ఎందకు ఆవహించింది, అసలు చంచల హత్య ఎందుకు చేసింది, దాని వెనకున్న కారణమేమిటి, భాగమతి కథను ఆమె ఎలాంటి కొలిక్కి తీసుకొస్తుంది అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :
          సినిమా ఆరంభం నుండి చివరి వరకు కథకు ప్రధాన ఆధారంగా నిలిచిన అనుష్క తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, నటనతో ఆద్యంతం మెప్పించింది. హర్రర్ సన్నివేశాల్లో తన హావభావాలతో ప్రేక్షకుల్లో థ్రిల్ కలిగేలా చేసి భాగమతిగా ఆకట్టుకునే తన ఆహార్యంతో, బాడీ లాంగ్వేజ్ తో పూర్తిస్థాయి నటనను కనబర్చి చప్పట్లు కొట్టేలా చేసింది. ఫస్టాఫ్లో కొన్ని థ్రిల్లింగ్ సీన్లతో పాటు మంచి ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చి సెకండాఫ్ పై ఆసక్తి కలిగేలా చేసిన దర్శకుడు సెకండాఫ్లో కూడా అలాంటి సీన్లనే కొన్నింటిని అందించి మెప్పించారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రియలిస్టిక్ గా అనిపించే భారీ బంగ్లా సెట్ ను రూపొందించి సినిమాకు డార్క్, హర్రర్ లుక్ ను అందించి అనుక్షణం ప్రేక్షకుడు ఉత్కంఠకు గురయ్యేలా చేశారు.

మైనస్ పాయింట్స్ :
           సినిమాకు ప్రధాన మైనస్ హర్రర్ సన్నివేశాలు మినహా కథకు ప్రధాన బలంగా నిలిచే కీలకమైన సన్నివేశాల్లో తీవ్రత లోపించడం. చాలా సీన్లు ఏదో నడుస్తున్నట్టే ఉంటాయి తప్ప పెద్దగా ఎగ్జైట్మెంట్ కలిగించవు. సినిమా క్లైమాక్స్ కొంత ఊహించనిదే, కొత్తదే అయినప్పటికీ అందులో తీవ్రత లేకపోవడంతో ప్రేక్షకుడు పెద్దగా ఎగ్జైట్మెంట్ ఫీలవకపోగా అసంతృప్తి చెందుతాడు. ప్రేక్షకుడు సినిమాకు ఒక కథను ఊహించి వచ్చినప్పుడు దర్శకుడు అసలు కథ వేరే ఉందనే ట్విస్ట్ ఇవ్వదల్చుకుంటే ఆ వేరే కథ ఎంతో బలంగాను, ప్రేక్షకుడు ఊహించుకున్నదానికంటే గొప్పగాను ఉండాలి. కానీ ఇందులో దర్శకుడిచ్చిన వేరే కథ ప్రేక్షకుడు ఊహించుకునే స్థాయిలో లేకపోవడంతో కొంత నిరుత్సాహం తప్పలేదు.
 
 
Be the first one to comment. Click here to post comment!